Volunteers : వాలంటీర్లపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం!
Volunteers : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పని చేస్తున్న విషయం తెలిసిందే. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను డైరెక్ట్‌గా ప్రజలకే చేరవేస్తున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను నియమించి సేవలు అందిస్తున్నారు. కరోనా టైంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చేశారు. దీంతో వాలంటీర్లపై అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే వాలంటీర్లు ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం అయిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. టీడీపీ ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టీడీపీ ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం అంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ అంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చారు. వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు ప్రస్తుత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజాగా దీనిపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఆయన మీడియాతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చేశారు. రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.