JAISW News Telugu

AP Elections 2024 : అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. మారుతున్న లెక్కలు..కలిసొచ్చేదెవరికో?

AP Elections 2024

AP Elections 2024

AP Elections 2024 : ఏపీలో మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు అన్నట్టుగా మారిపోయింది. అభ్యర్థుల ఎంపికల సీఎం జగన్ సామాజిక లెక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈనేపథ్యంలో టీడీపీకి మద్దతు ఇచ్చే కమ్మ సామాజిక వర్గ నేతలు వైసీపీ బాట పడుతున్నారు. ఇక వైసీపీకి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకునే రెడ్డి సామాజిక వర్గం టీడీపీ వైపు వెళ్తోంది. గత ఎన్నికల నుంచి ఈ సామాజిక వర్గాల షిష్టింగ్ మంచి పరిణామమే. ఇది ఈసారి ఎన్నికల్లో కూడా కనిపించడం విశేషమే.

తాజాగా ఎన్నికల వ్యూహాలు మారిపోతున్నాయి. టీడీపీకి తొలి నుంచి కమ్మ సామాజికవర్గం అండగా నిలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం మెజార్టీగా ఉన్న నియోజకవర్గాల్లో తొలి నుంచి టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. 2019లో మాత్రం కొంత పరిస్థితిలో మార్పు కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ పార్టీల్లో జంపింగ్స్ మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో గతంలో టీడీపీలో పనిచేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాశ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక గుంటూరు జిల్లాలోనూ ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ఇదే సమయంలో టీడీపీ సైతం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తోంది. తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంది. వైసీపీ వీరిపై వేటు వేసింది. ఇక వచ్చే ఎన్నికలకు  ముందు ఇదే వర్గానికి చెందిన నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒక ఎంపీ, మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేతోనూ టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

వైసీపీలో సీట్ల వ్యవహారం ఫైనల్ అయిన తర్వాత సీట్లు దక్కకపోతే వీరు సైకిల్ ఎక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ నేతలు పొత్తు కారణంగా రెండు పార్టీల్లో ఈ రెండు వర్గాలకే ప్రాధాన్యం కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది.

దీంతో ఈసారి మూడు పార్టీలు ఎన్నికల రేసులో ఉండడం.. ప్రధానంగా ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నేతల మద్దతు చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటింగ్ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ తమ పార్టీ తొలి నుంచి బీసీలకు అనుకూలంగా ఉందని చెబుతోంది. అయితే జనాభాలో సగం ఉన్న బీసీల ఓటు బ్యాంకు కీలకంగా మారడంతో మెజార్టీ మద్దతు ఎవరికి దక్కుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలే ఆ పార్టీకి 151 సీట్లు రావడానికి దోహదపడ్డాయి. ఇక తాజాగా మారుతున్న సామాజిక సమీకరణాలు ఎన్నికల్లో ఎవరికీ కలిసి వస్తాయో.. ఎవరికీ పట్టం కడుతాయో అన్నది చూడాలి.

Exit mobile version