AP Politics 2024 : ఆ వయసులో వారు అంతగా కష్టపడుతుంటే మీకేమైంది?

AP Politics 2024

AP Politics 2024, Chandrababu Naidu and Bhuvaneshwari

AP Politics 2024 : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు టీడీపీకి, రాష్ట్రానికి కూడా కీలకమైనవని గుర్తించి, ప్రజల మధ్య  తిరుగుతూ పార్టీకి బలం కూడగడుతున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు 70 ఏండ్ల పైబడి వయస్సు ఉన్నప్పటికీ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్య తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీలో వీరిద్దరి కృషి వల్ల టీడీపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని వేరే చెప్పనక్కర్లేదు.

ఇంత వయస్సులోనూ వారిద్దరు ఇంతగా కష్టపడుతుంటే..టీడీపీలో కొందరు నేతలు ఎండలకు భయపడి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్ లకు పరిమితమవుతున్నారు. టికెట్లు దక్కనివారు కొందరు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పార్టీపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలవాటు ప్రకారం కొన్ని రోజులు మాయమైపోయి మళ్లీ నేటి నుంచి వారాహితో ప్రజల మధ్యకు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే ఎండలో పడి తిరుగుతున్నారు. టీడీపీ, చంద్రబాబు నాయుడితో పోలిస్తే జనసేన, పవన్ కల్యాణ్ కు ఒత్తిడి కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ పార్టీకి అత్యంత కీలకమైన సమయంలో కూడా పవన్ కల్యాణ్ మధ్యలో ఎందుకు గ్యాప్ తీసుకుంటారో తెలియదు.

అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంటారు గనుక పవన్ కల్యాణ్ జనం మధ్యకు వచ్చిన ప్రతీసారి వైసీపీలో ప్రకంపనలు మొదలవుతుంటాయి. సీట్ల సర్దుబాట్ల వ్యవహారంలో జనసేనలో అలకపాన్పుల సీన్లు పూర్తయినట్లే ఉన్నాయి. కనుక పవన్ కల్యాణ్ ఇక నుంచి మే 13న పోలింగ్ పూర్తయ్యే వరకు గ్యాప్ తీసుకోకుండా ప్రజలు, పార్టీ శ్రేణుల మధ్య ఉంటే మంచిది.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ లేనట్లే వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. టీడీపీ, జనసేన కలిసిన తర్వాత రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటీలు వేసుకుని ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. కానీ బీజేపీతో వాటితో కలిసినా అటువంటి ప్రయత్నమేదీ చేయడం లేదు. ఈ గ్యాప్ ను మూడు పార్టీలు కలిసి తగ్గించుకోవాలి. ఎన్నికలకు ఇంకా 45 రోజులే ఉండడంతో గ్యాప్ తగ్గించుకోవడం, తమ మధ్య గ్యాప్ లేదని ప్రజల ముందు నిరూపించుకోవడం చాలా అవసరం. లేకుంటే మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగే అవకాశం ఉండదు. కారణాలు ఏవైనప్పటికీ ఈ గ్యాప్ వలన మూడు పార్టీలను నష్టం తప్పదు. దీంతో వైసీపీ లబ్ధి జరుగుతుందనే విషయాన్ని మరవకూడదు.

TAGS