IT Serve Synergy Summit : ఏపీకి మీ సహకారం అవసరం.. ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో ఎన్నారైలకు మంత్రి లోకేష్ పిలుపు
IT Serve Synergy Summit : అమెరికాలోని లాస్‌వేగాస్‌లో నిర్వహిస్తున్న ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల సహకారం అవసరం చాలా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 70మంది కొత్త వారేనని చెప్పుకొచ్చారు. తమ పార్టీ ప్రజలను నిజాయితీగా పాలించగల నాయకత్వ లక్షణాలను నేర్పిస్తుందన్నారు. 25మందిలో 17 మంది కొత్త మంత్రులున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కోపం, ఒత్తిడి బాధ కలిగితే ఏం చేస్తారన్న ప్రశ్నకు.. లాంగ్ బ్రీత్ తీసుకుని సైలెంటుగా ఉండిపోతానన్నారు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయని.. కోపం, ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నారు. ఉన్నంత కాలం ప్రజా సేవలో మమేకం అవుతామన్నారు.
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏపీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ నాయకత్వం అవసరమని మంత్రి లోకేష్ అన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం తమ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్‌లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి ఏడబ్ల్యూఎస్ కట్టుబడి ఉండటం.. 2030 నాటికి ఏపీ 72 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు.
స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసా ఇస్తాయని తెలిపారు. ఏడబ్ల్యూఎస్ తదుపరి డేటా సెంటర్‌కు ఏపీని అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడబ్ల్యూఎస్ సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు ఏడబ్ల్యూఎస్ సహకారాన్ని కోరుతున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్.. అమెరికా పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రనూయి సూకీని కూడా కలిశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వాలని కోరారు.