AP High Court : రైతులకు పెట్టుబడి రాయితీ, విద్య దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ నెల 13న ఓటింగ్ ముగిసే వరకు ఈ పథకాలకు సంబంధించిన నిధులను జమచేయవద్దంటూ ఈసీ ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీ వరకు తాత్కాలికంగా పక్కనపెట్టింది. నిధుల పంపిణీకి ఏ విధంగాను మీడియాలో ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని అతిక్రమించేలా వేడుకలు నిర్వహించవద్దని, నాయకుల జోక్యం లేకుండా చూడాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలన ప్రతివాదులను ఆదేశించారు. విచారణను జూన్ 27కి వాయిదా వేశారు.
ఈనెల 13న పోలింగ్ తేదీ ముగిసే వరకు పెట్టుబడి రాయితీ, విద్య దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల సొమ్ము రూ. 14,165 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా నిలువరిస్తూ 9న ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని, అంతకు ముందు ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.