Tirumala : పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించి తిరుమల నుంచి శ్రీకారం చుట్టింది. టీటీడీ ఇన్ చార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డిని విధుల నుంచి తప్పించింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును పూర్తిస్థాయి ఈవోగా నియమించింది. ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు విధుల పట్ల చిత్తశుద్ధితో ఉంటారని, నిబద్ధతతో వ్యవహరిస్తారని ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో విధులు నిర్వర్తిస్తున్న శ్యామలరావును టీటీడీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2022 మేలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి బదిలీ కావడంతో అప్పట్లో అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఈవోగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ పోస్టులోకి ఎవరినీ రానివ్వకుండా ఆయనే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాగానే అయనను ఈ నెల 11న సెలవుపై పంపించింది. శుక్రవారం ఆయనను అక్కడి నుంచి పూర్తిగా రిలీవ్ చేసింది.