AP Employees Union : మేం తలుచుకోం కానీ తలుచుకుంటే ప్రపంచం తలకిందులు అవుతుంది అనుకుంటారు కొందరు. ఇలాంటి కోవకు చెందిన వారే ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు. ఏపీ ప్రభుత్వంపై నాలుగున్నర ఏండ్లుగా ఓపిక పట్టామని ఇక తమ వల్ల కాదని.. బండి శ్రీనివాసరావు అనే పెద్ద మనిషి ప్రకటనలు చేస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు తెరపైకి వస్తున్నారు. ఎమ్మార్వోను నడిరోడ్డుపై చంపితే.. నంగి నంగిగా మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు వంటి వాళ్లు కూడా మాట కలపనున్నారు. ఇన్ని రోజులు ఎదురుచూశారు కదా..రేపో, మాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.. ఇప్పుడు ఏం చేస్తారంటే.. వారి నుంచి వచ్చే సమాధానం డ్రామాలే.
ఏపీ సర్కార్ పై ఉద్యోగులు ఎలా మండిపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగులను దోచుకున్న ప్రభుత్వం గతంలో లేదు. అయినా జగన్ రెడ్డిని పొగుడుతూ వచ్చిన ఉద్యోగ సంఘం నేతలు ఇప్పుడు.. తమ ఉద్యోగులను మోసం చేసేందుకు సమ్మె డ్రామాలు ప్రారంభించారు. సమ్మెలు చేస్తామని, ఉద్యమం చేస్తామని చెప్పి.. ఏదో రెండు, మూడు హామీలు ఇప్పించేసి పాలాభిషేకాలు చేసే టాస్క్ లను ప్రభుత్వ పెద్దలు..ఈ ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చారని అంటున్నారు.
ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఈ నేతలు పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు డ్రామాలు కడుతున్నారని అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 42శాతం పీఆర్సీ ఇచ్చింది. తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీ ఏర్పాటు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చి దీనికి కోత పెట్టారు. ఊరకే పీఆర్సీ ప్రకటన చేశారు కానీ.. ఇంతవరకూ సమావేశం కాలేదు. ఎన్నికలకు వెళ్లే ముందు ఏడు శాతం ఐఆర్ తో పాటు.. మళ్లీ గెలిస్తే బోలెడు చేస్తామని హామీలు ఇచ్చేందుకు.. ఉద్యోగ సంఘాల నేతలతో కొత్త డ్రామాకు వైసీపీ సలహాదారులు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా బండి శ్రీనివాసరావు.. బొప్పరాజు వంటి వాళ్లు.. రోడ్ల మీదకు వచ్చి డాన్సులేయడమే మిగిలింది. వీరి తీరు చూసి ఉద్యోగులు కూడా.. జగన్ రెడ్డి కన్నా వీళ్లే తెలివైన వాళ్లని జోకులు పేలుస్తున్నారు.