AP Elections : ఏపీ ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత అధినేతలు అందరూ ప్రచారంలో బిజీబిజీ అయిపోయారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో కొత్త మార్పులు తెర మీదకు వస్తున్నాయి. మూడు పార్టీల సీట్ల లెక్కల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అనపర్తి నుంచి సీటు కోల్పోయిన నల్లమిల్లి తాజాగా చంద్రబాబును కలిశారు. అదే విధంగా జమ్మలమడుగు సీటు బీజేపీకి వెళ్లింది. అక్కడ మార్పు జరిగే చాన్స్ ఉంది. కడప ఎంపీ సీటులోనూ అభ్యర్థి మారనున్నట్లు సమాచారం.
పొత్తులో భాగంగా కడప జిల్లాలో రెండు స్థానాలు బీజేపీకి దక్కాయి. అందులో జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు ప్రకటించారు. అక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి సీటుపైన నమ్మకం పెట్టుకున్నారు. బీజేపీకి సీటు కేటాయించడంతో భూపేశ్ కు టీడీపీ నుంచి కడప ఎంపీ సీటు కేటాయించారు. కానీ, తాజాగా కడప జిల్లాలో మార్పుల వైపు కసరత్తు జరుగుతోంది. తాను పోటీ చేస్తున్న జమ్మలమడుగు సీటు టీడీపీకి కేటాయించి.. కడప పార్లమెంట్ సీటు తీసుకునేలా బీజేపీ నాయకత్వంతో ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం మొదలుపెట్టారు.
దీంతో కడప ఎంపీగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. జమ్మలమడుగు నుంచి భూపేశ్ టీడీపీ క్యాండిడేట్ గా బరిలో నిలిచేలా చర్చలు సాగుతున్నాయి. తాజా ప్రతిపాదనకు బీజేపీ అంగీకరిస్తే మరో ఎంపీ సీటు బీజేపీకి పెరగనుంది. టీడీపీకి మరో అసెంబ్లీ సీటు దక్కనుంది. ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ కుటుంబం నుంచి వస్తున్న సూచనలతో ఆదినారాయణ రెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకొచ్చారు.
వైసీపీ నుంచి కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి షర్మిలా రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ అంగీకరిస్తే తాజా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నుంచి భూపేశ్ పోటీ చేయాలని కమలం పార్టీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనికి భూపేశ్ సిద్ధంగా లేరని సమాచారం. టీడీపీకి జమ్మలమడుగు సీటు కేటాయిస్తే పోటీలో నిలువాలనే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ అంగీకరించకపోతే ప్రస్తుతం ప్రకటించినట్లుగానే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి భూపేశ్ కడప ఎంపీగా పోటీలో నిలువనున్నారు.