AP Elections 2024 : రెండు నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పార్టీల సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఐదు జాబితాల్లో తన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో జగన్ సభలు పెడుతూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ ‘రా.. కదిలిరా’’ పేరుతో శ్రేణులకు ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. ఇక టీడీపీ, జనసేన కూటమి సీట్ల కసరత్తు చేస్తోంది. బీజేపీతో పొత్తు విషయం తేలాక అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఏపీలో జరుగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్ పాల్.. వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
ఆ సర్వే సంస్థలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ రెండో సారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి. 52 శాతం మంది జగన్ ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయని తేలుస్తున్నాయి.
రీసెంట్ గా మరో సర్వే సంస్థ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. గురువారం ఎలెక్ సెన్స్ సర్వే సంస్థ్ తన నివేదికను వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన సర్వే ఇది. అన్ని నియోజకవర్గాల్లో 88,700 మంది అభిప్రాయాలను సేకరించింది.
ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో వైసీపీ విజయఢంకా మోగిస్తోందని అంచనా వేసింది. తెలుగు దేశం-జనసేన పార్టీ 53 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కనీసం తమ ఖాతాను కూడా తెరువలేవని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.14శాతం మేర ఓట్లు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ-జనసేనకు 44.34 శాతం, బీజేపీకి 0.56శాతం, కాంగ్రెస్ 1.21శాతం మేర ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై 53.7శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 6.3శాతం ఫర్వాలేదని పేర్కొనడం గమనార్హం.