AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇంకారెండు నెలలే సమయం ఉండటంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ రా కదలిరా అంటూ సభల ద్వారా హోరెత్తిస్తోంది.
వైసీపీ సైతం సిద్ధం అంటూ నినదిస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 4 నుంచి జనసేన అధినేత వారాహి ద్వారా రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వైసీపీని ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాకున్నా జనసేన, టీడీపీ కలిసి పోటీకి రెడీ అవుతున్నాయి. జగన్ ను ఓడించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాయి.
పవన్ కల్యాణ్ అనకాపల్లి నుంచి పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ ఖరారైంది. అవసరాన్ని బట్టి పాదయాత్ర రూట్ మారే అవకాశం ఉంది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. దీంతో ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదని అర్థమవుతోంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. వైసీపీ పాలన తీరును ఎండగడుతున్నారు. దోపిడీ, దొంగతనాలు, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి కారకులైన వారిని వైసీపీ రక్షిస్తోందనే ప్రచారం చేస్తున్నారు. దీంతో జగన్ కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివే అనే వాదనలు కూడా వస్తున్నాయి.