AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు నడుస్తుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు.. కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ తన ఓటు హక్కును కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో వినియోగించకున్నారు. ఇక్కడి జయమహల్ ప్రాంతంలో గల అంగన్ వాడీ పోలింగ్ బూత్ నంబర్ 138లో ఆయన కొద్దిసేపటి కిందే ఓటు వేశారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటర్లు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. తమను గెలిపించడానికి ఎక్కడెక్కడి నుంచో తెలుగు వారందరూ ఏపీకి వచ్చారన్నారు. విదేశాల్లో నివసించే తెలుగు వాళ్లు సైతం టీడీపీకి ఓటు వేయడానికి ఇక్కడికి చేరుకున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నివసించే తెలుగు ఓటర్లు కూడా భారీ ఎత్తున ఏపీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఓటు వేయడానికి ఇంతమంది తరలిరావడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
కాగా, ఈ సారి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. జనాల్లో కూడా ఈ ఎన్నికలపై అత్యంత ఆసక్తి ఉండడంతో ఎలాగైనా ఓటు వేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం బయట ఉన్నా ఏపీ ఓటర్లు అందరూ భారీగా తరలివస్తున్నారు.