AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలు అక్కడే ఫోకస్ పెడుతున్నాయి. సెంటిమెంట్ రాజేసి సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కువగా ఇక్కడే గెలవాలని ఆశిస్తున్నాయి. జనసేన పార్టీ కూడా ఇక్కడే తన ప్రభావం చూపాలని కంకణం కట్టుకుంది. కాపు ఓట్లు పుష్కలంగా ఉండటంతో ఇక్కడి నుంచే పోటీలో నిలిచి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 2019 ఎన్నికల్లో జనసేనకు ఇక్కడ 14 శాతం ఓట్లు రావడం గమనార్హం.
గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఏకైక స్థానం రాజోలు ఈ జిల్లాలోనే ఉంది. జనసేన ఈ జిల్లాల్లో కనీసం ఆరు స్థానాలకైనా పోటీ చేయాలని నిశ్చయించుకుంది. టీడీపీతో పొత్తులో భాగంగా రాజోలు, రాజానగరం అధికారికంగా ప్రకటించినా కాకినాడ, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, ముమ్మిడివరం కూడా వారి జాబితాలో ఉన్నాయని తెలుస్తోంది.
కొత్తపేట, రామచంద్రాపురం వంటి స్థానాల్లో కూడా జనసేన పోటీ చేయాలని అనుకుంటోంది. ఈనేపథ్యంలో గోదావరి జిల్లాలను తమకు వేదికగా చేసుకోవాలని అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో సీనియర్ నేత. ఆయన ఆ స్థానాన్ని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ విఎన్ఎస్ వర్మ టీడీపీ నుంచి బరిలో నిలవనున్నారు. ఈ సీటును జనసేనకు కేటాయిస్తే వర్మ రెబల్ గా మారి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ముమ్మిడివరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చురుకుగా ఉన్నారు. ఆయన కూడా తన సీటును వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య పొత్తులో వీటిని జనసేనకు ఇస్తే రెబల్ గా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.