AP Elections 2024 : పొత్తుల్లో మారిన లెక్కలు.. ఫైనల్ లిస్ట్ రెడీ..రేపోమాపో ప్రకటన

AP Elections 2024

AP Elections 2024 Janasena BJP and TDP

AP Elections 2024 : ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తుపైన అధికారికంగా ప్రకటన రానుంది. సీట్ల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్లపైన మూడు పార్టీల మధ్య అనేక ప్రతిపాదనలు.. చర్చల తర్వాత దాదాపు ఫైనల్ జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రతిపాదించిన లెక్కలు మారాయి. ప్రధానంగా టీడీపీ, జనసేనలో ఆశావహుల త్యాగాలు తప్పేలా లేవు. ఢిల్లీలో తుది చర్చలు.. పొత్తు ప్రకటన లాంఛనమే.

రాష్ట్రంలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరిక దాదాపు ఖాయమైంది. రెండు రోజుల్లోనే పొత్తుపై అధికారిక ప్రకటన రానుంది. రేపు ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారు. బీజేపీ నేతలతో పొత్తులపై తుది చర్చల తర్వాత చంద్రబాబు ఫైనల్ గా సీట్ల ఖరారుపైన నిర్ణయం వెల్లడించనున్నారు.

గతంలో జనసేనకు 25-28 సీట్లను ప్రస్తుతం 30 వరకు ఇవ్వాల్సిందేననే పవన్ ఒత్తిడికి చంద్రబాబు అంగీకరించినట్టు సమాచారం. జనసేనకు 30 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో పవన్ వెల్లడించారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుందని.. తానే వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్టు పవన్ వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల అంశంపైన ప్రాథమికంగా నిర్ణయం జరిగింది.

పొత్తులో భాగంగా బీజేపీకి ఎంపీ సీట్లు 5, అసెంబ్లీ 12 స్థానాలను అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేనకు, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, తిరుపతి స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు.  అసెంబ్లీ స్థానాల్లో 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి 13 సీట్లు కేటాయించారు. ఇప్పుడు 12 స్థానాలు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అందులో గతంలో కేటాయించిన స్థానాల్లో కొన్ని మార్పులు జరుగనున్నాయి. ఇక బీజేపీకి కేటాయించే సీట్లపైన తాజాగా ఆ పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు సాగుతున్నాయి. ప్రాథమికంగా ఆ సీట్లపైన ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు తమ నిర్ణయం వెల్లడించనున్నారు. రేపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక విశాఖ-గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ ముందుగానే తమ అభ్యర్థులను ఖాయం చేశారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో పెందుర్తి, భీమిలి, గాజువాక, యలమంచిలికి ఇన్ చార్జులను ప్రకటించారు. పొత్తు ఖాయం అయిన తర్వాత అధికారికంగా ఈ సీట్లపైన ప్రకటన చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరిలో గతంలోనే రాజోలు, రాజానగరం ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని సైతం జనసేన పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చారు.  అయితే సీట్లు రాని వారు త్యాగాలకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలతో తుది చర్చల అనంతరం.. మూడు పార్టీల కూటమి పోటీ..సీట్ల అంశంపై అధికారికంగా ప్రకటించనున్నారు.

TAGS