AP Elections 2024 : ఏపీలో కాపులు బలమైన సామాజికవర్గం. ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి ఇప్పటి వరకూ కాపు సామాజిక వర్గం నుంచి ఒక్కరూ సీఎం కూడా కాలేదు. అత్యధిక జనాభా, పెద్ద నేతలు ఉన్నా సీఎం అవకాశమైతే రాలేదు. ఉన్నత పదవి ఆకాంక్ష ఆ సామాజిక వర్గంలోని ప్రతీ ఒక్కరిలో ఉంటుందనడంలో డౌటే లేదు. అందుకే కాపు వ్యక్తులు ఎవరు పార్టీ పెట్టినా వారికి సహకరిస్తుంటారు. అలాగే కాపు నేతలకే ఓట్లు వేస్తుంటారు. ఇలా కులాభిమానాన్ని చాటుకుంటుంటారు. ఈ సామాజిక వర్గంలో సీనియర్ నేత హరిరామ జోగయ్య కులానికి రాజ్యాధికారం రావాలని తపన పడే వారిలో ముందుంటారు.
మొన్నటివరకూ పవన్ కల్యాణ్ కోసమేనంటూ ఆయన్నే టార్గెట్ చేస్తూ విపక్ష కూటమిని ఇరుకున పెట్టిన హరిరామ జోగయ్య తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ఓ దశలో పవన్ రివర్స్ కావడంతో తన కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన జోగయ్య ఇవాళ మరోసేన ఏర్పాటు చేశారు. అంతే కాదు పవన్ కల్యాణ్ కు పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. పిఠాపురంలో పోటీ వేళ జోగయ్య ప్రకటన పవన్ కు పెద్ద ఊరటే అని చెప్పవచ్చు.
రాష్ట్రంలో గతంలో తన ఆధ్వర్యంలో పనిచేసిన కాపు సంక్షేమ సేనను ఈ మధ్యే రద్దు చేశారు. తాజాగా యూటర్న్ తీసుకుని రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పవన్ రాజ్యాధికారం చేపట్టేందుకు వీలుగా కొత్తగా ఏర్పడిన ఈ సేన పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. గతంలో ఉన్న కాపు సంక్షేమ సేన రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో నూతనంగా కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించామని, 25 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేసినట్టు హరిరామజోగయ్య తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టే సత్తా పవన్ కే ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. తన ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ సభ్యులు అందరూ పవన్ వెనక ఉంటారన్నారు.
రాష్ట్రంలో కాపులు, బీసీ, ఎస్సీలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయం అన్నారు. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే కాపు బలిజ సంక్షేమ సేన ప్రధాన లక్ష్యమన్నారు. వైసీపీని ఓడించడమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని హరిరామ జోగయ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని చెప్పారు.