JAISW News Telugu

AP DSC Notification 2024 : లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటే.. 6వేల పోస్టులతో డీఎస్సా? సర్కార్ పై నిరుద్యోగుల ఆగ్రహం..

AP DSC Notification 2024

AP DSC Notification 2024

AP DSC Notification 2024 : ఎన్నో రోజులుగా లక్షలాది నిరుద్యోగులు డీఎస్సీ వేయండి సార్.. అంటూ మొత్తుకున్నా వినని ప్రభుత్వం ఎన్నికలు వస్తున్న వేళ..ఏదో నామ్ కే వాస్తేగా ఓ డీఎస్సీ ప్రకటన చేసింది. వేలల్లో ఖాళీలు ఉన్నా కేవలం 6,100 పోస్టులను భర్తీ చేస్తామంటూ ప్రకటించింది. అతి తక్కువ పోస్టులు వేసి లక్షలాది మంది నిరుద్యోగులను తన్నుకు చావండి అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

నిన్న ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ.. డీఎస్సీ-2024ను ప్రకటిస్తున్నాం..ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఏడు రకాల మేనేజ్ మెంట్ పాఠశాలల పరిధిలో 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.

ఈ పోస్టుల్లో ఎస్జీటీ- 2,280, స్కూల్ అసిస్టెంట్ -2,290, టీజీటీ-1,264, పీజీటీ-215, ప్రిన్సిపల్ పోస్టులు-42 ఉన్నాయని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని, రూ.73వేల కోట్లు విద్యపై ఖర్చు పెట్టిందని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ నెలకు రెండు సార్లు విద్యాశాఖపై రివ్యూలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. పిల్లలకు ఉచితంగా ట్యాబ్ లు ఇచ్చే కార్యక్రమం ప్రతీ సంవత్సరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూన్ నాటికి డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తై  జూలై నాటికి వాళ్లంతా విధుల్లో ఉంటారని చెప్పారు. ఇక నుంచి జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తామన్నారు.

కాగా, ఈ నెల 12 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. ఫీజు కట్టడానికి ఈనెల 21న చివరి తేదీ అన్నారు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెండు సెషన్స్ లో, కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. జనరల్ కేటగిరిలో గరిష్ట వయస్సు 44 ఏండ్లు ఉంటుందన్నారు.

ఇక ఏపీ టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్ లో నిర్వహిస్తారని అధికారులు చెప్పారు. పరీక్షల తర్వాత కీలు, ఫైనల్ కీల విడుదల తర్వాత మార్చి 14న టెట్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

నిరుద్యోగుల ఆందోళన..

తక్కువ పోస్టులతో తూతూ మంత్రంగా డీఎస్సీ వేసిందని, లక్షలాది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తుండగా కేవలం 6వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. అలాగే నెలన్నర రోజుల్లోనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే తమకు చదువుకునే టైమ్ ఎక్కడ ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. ప్రభుత్వం ఎన్నికల వేళ..నిరుద్యోగుల ఓట్ల కోసం ఈ నోటిఫికేషన్ వేసిందని..కానీ ఈ నోటిఫికేషన్ పై ఏ నిరుద్యోగి సంతృప్తిగా లేరని అంటున్నారు.

Exit mobile version