Deputy CM Pawan Kalyan : వారాహి అమ్మవారు గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి చాల తక్కువ మందికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేశారు. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారాహి దీక్ష గురించి చాలా మందికి తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో మరోమారు పవన్ వారాహి అమ్మవారి దీక్ష స్వీకరిస్తున్నారు. జూన్ 25 నుంచి 11 రోజులపాటు ఆయన దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు.
వారాహి అమ్మవారు ఎవరు?
మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. పురణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభు.. వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరీదేవి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీవారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలు.. వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం.. వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో పేర్కొన్నారు.
వారాహి అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తారు?
వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి. కావున శత్రుభయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో భయం ఉండకూడదు అని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారి ఆరాధనలో అరిషడ్వర్గాలు.. అంటే కామ, క్రోధ, మధ, మోహ, మాత్సర్యాల నుంచి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు.
వారాహి అమ్మవారి దీక్ష వివరాలు..
వారాహి అమ్మవారి దీక్షను జేష్ఠ్య మాసం చివర్లో లేదా ఆషాడ మాసం మొదట్లో చేపడతారు. కొందరు సాధారణంగా నవరాత్రి దీక్షలా తొమ్మిది రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు దీక్ష చేస్తారు. అన్ని దీక్షలలాగే సాత్వికాహారం తీసుకుంటారు. ప్రతీరోజు తలస్నానం చేస్తూ.. రెండు పూటలా పూజలు చేస్తారు. మెడలో ఓ కండువాతో, చెప్పులు లేకుండా నడుస్తారు. నేలపై పడుకుంటూ, అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు.
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పాలన సవ్యంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని, శత్రువులను ఎదుర్కోవాలని వారాహి అమ్మవారి దీక్ష స్వీకరిస్తున్నారు.