AP CM Jagan : వైఎస్ జగన్ గురించి ఆ పార్టీ వాళ్లు ఎలివేషన్లు మాములుగా ఉండవు. ఆయన ఎప్పుడూ రాజకీయమే ఆలోచిస్తూ ఉంటారని, ఆయన ఎత్తుగడలను ప్రత్యర్థులు పసిగట్టలేరని అంటుంటారు. అది ఎంతవరకు నిజమో అన్నది ఒక్కోసారి అనుమానం కలుగక మానదు.
ఇటీవల ఎడాపెడా మారుస్తున్న నియోజకవర్గ ఇన్ చార్జుల తీరు చూస్తుంటే ఈ అనుమానం బలంగా కలుగుతుంది. నియోజకవర్గ ఇన్ చార్జి అంటే బై డీఫాల్ట్ గా అక్కడ వైసీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థి అనే. ఇది జగన్ కనిపెట్టిన కొత్త పద్ధతి. ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గ ఇన్ చార్జులుగా నియమించడం, వారి పనితీరు, వారి పట్ల జనం స్పందన బాగుంటే వారికి టికెట్ ఇవ్వడం ఇదీ పద్ధతి. ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా అదే దోవన పోతున్నాయి. అది వేరే సంగతి.
అయితే ఇలా ఒకసారి నియోజకవర్గం ఇన్ చార్జి పదవి ఇచ్చాక మరీ వారం పది రోజులు కూడా దాటకుండానే మార్చేయడం, తాను అనుకున్న వారి మనోగతం తెలుసుకోకుండా ఇవ్వడం, వారు పార్టీ వదలిపోవడం, ఒకసారి ఇచ్చిన వారిని మార్చేస్తే వాళ్లు అలగడం, ఇవన్నీ కలిసి ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పైగా ప్రతిపక్ష మీడియా బలంగా ఉంది. గోరంతలు కొండంతలు చేసి చూపిస్తుంది. అలాంటిది ఇలా అవకాశం ఇస్తే ఇంకా రెచ్చిపోతుంది.
తెలుగు దేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు పైకి తీసుకురాదు కానీ వైసీపీ గొడవలు మీద మాత్రం భూతద్దం పెడుతుంది వేరే చెప్పక్కర్లేదు. అనకాపల్లిలో పీలా గోవింద్ అలిగిన మౌనం వహించినా, ఆయన వర్గం నానా హడావిడి చేసినా ఎల్లో మీడియాకు పట్టదు. అదే వైసీపీ సంగతులు అయితే చెప్పనక్కర్లేదు.
ఇవన్నీ తెలిసి కూడా జగన్ అస్సలు జాగ్రత్తగా ఉండడం లేదు. అసలు జగన్ వైఖరినే కేర్..నాట్ అనే పద్ధతి. ఎవరు వెళ్లిపోతే వెళ్లిపోండి. ఎవరు దూరం అయితే కానివ్వండి.. ఎవరు ఎలా రాసుకుంటే అలా రాసుకోండి. నాకు జనం ఉన్నారు..అని అంటారు. కానీ జనం ఎక్కడి నుంచి వస్తారు. నాయకులు అంతా కలిసి తెస్తేనే జనం వస్తారు. ఆ సంగతి జగన్ కు తెలియదని అనుకోవాలా?
పోనీ ఆ సంగతి అలా ఉంచుదాం. వారానికి ఓ ఇన్ చార్జిని మారుస్తూ ఉంటే పార్టీ కార్యకర్తలు ఎవరి వెంట ఉండాలి? ఎన్నికల టైంలో కార్యకర్తలను వెంట ఉంచుకోవాలి అంటే రోజుకు లక్షల్లో ఖర్చు. వారం రోజులు ఈ ఖర్చు పెట్టుకున్నాక, తూచ్.. నువ్వు కాదు వేరే వాళ్లు అంటే అప్పటిదాక ఖర్చు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటీ? పోనీ డబ్బు సంగతి అలా ఉంచుదాం. జనాల్లో పరువు పల్చనైపోదా?
జగన్ కు నిజంగా రాజకీయ పరిణితి ఉంటే ఇలా చేస్తారా? చిన్న పిల్లాడు బొమ్మలతో ఆడుకుని బోర్ కొట్టినప్పుడల్లా వాటిని మార్చేసినట్లు, కేండిడేట్ లను మార్చేస్తే ఎలా? వాళ్లకు కూడా మనోభావాలు ఉంటాయి. జనాల్లో గౌరవ మర్యాదలు ఉంటాయి. అనుచరులు ఉంటారు. ఈ సంగతి జగన్ పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. వాళ్లను గడ్డిపోచలు అనుకుంటున్నారేమో..అవన్నీ కలిస్తే బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జగన్ ఆలోచనా విధానం, అవలంబిస్తున్న పద్ధతి చూస్తుంటే.. దాన్ని నిర్వచించాలి అనుకుంటే.. మొండితనంతో కూడిన లెక్కలేని తనం, లేదా నిర్లక్ష్యం అని అనాల్సి వస్తుంది.