CM Chandrababu : నమ్మకస్తుడైన వ్యక్తికి కీలక పదవి అప్పగించిన ఏపీ సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీని గద్దె దించి సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పలు కీలక వాగ్దానాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన కేబినెట్లోని మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే సచివాలయంలో అడుగు పెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చార్జ్ తీసుకున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీనికోసం కసరత్తు మొదలుపెట్టారు. జనసేన, బీజేపీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో కార్పొరేషన్లు.. ఇతర నామినేటెడ్ ఛైర్మన్ పదవుల్లో ఆ పార్టీలకు చెందిన నాయకులకూ పంపకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు.
అదే సమయంలో కీలకమైన అడ్వొకేట్ జనరల్ పదవిని భర్తీ చేయనున్నారు చంద్రబాబు. సీనియర్ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను అడ్వొకేట్ జనరల్‌గా నియామకం దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర దమ్మాలపాటి శ్రీనివాస్ రెస్యూమ్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌కు పంపించారు. మిగిలిందల్లా ఆయన దీన్ని ఆమోదించడమే. అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించడం దమ్మాలపాటికి కొత్తేమీ కాదు. విభజన అనంతరం ఏర్పడిన ఏపీకి తొలి ఏజీ ఆయనే. 2014- 2019 చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయనను ఈ పదవిలో నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఏజీగా కొనసాగారు. 2019లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో- ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏజీగా పని చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడం వల్ల ఏజీ పదవి మళ్లీ దమ్మాలపాటి శ్రీనివాస్ ను వరించబోతోంది.