JAISW News Telugu

AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశం రెండున్నర గంటలపాటు జరిగింది. పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను ప్రభుత్వం రూపొందించనుంది. పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.

అదేవిధంగా ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయించింది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైనా మంత్రివర్గం చర్చించింది. అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరుపైనా సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైనా సమావేశంలో మంత్రులు చర్చించారు.

Exit mobile version