AP Election Results : ఏపీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు: ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఫలితం..

AP Election Results

AP Election Results

AP Election Results : చివరి దశ పోలింగ్ జూన్ 1వ తేదీ (శనివారం)తో ముగుస్తుంది. ఇక మూడు రోజుల గడువు తర్వాత జూన్ 4న లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట సైనికదళాల్లో పని చేసే సర్వీస్ ఓటర్ల ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌) ఓట్లు, తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు లెక్కిస్తారు. వాటిని లెక్కిస్తూనే 8.30కి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సగటున ప్రతీ 30 నిమిషాలకు ఒక రౌండ్‌ పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటలకే ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యేలా చూస్తారు. వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు పూర్తయిన తర్వాతే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు నాలుగు దశల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసన సభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు  పూర్తి చేసింది.

*మొదటి దశ..
సిబ్బంది ఉదయం 4 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకుంటారు. వారికి కేటాయించిన టేబుల్ గురించి ఉన్నతాధికారులు ఉదయం 5 గంటలకు వారికి చెప్తారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి.. కౌంటింగ్‌ సిబ్బందితో గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. నిర్ధేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. సిబ్బందికి విధుల కేటాయింపు అనేది ర్యాండమైజేషన్‌ ద్వారా 3 దశల్లో ఉంటుంది. లెక్కింపు ప్రారంభమయ్యే ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు లేదంటే వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను టేబుళ్లపైకి చేరుస్తారు.

*రెండో దశ..
– తొలుత సర్వీస్ ఓటర్ల ఈటీపీబీఎస్‌లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్‌ ఓట్లు లెక్కిస్తారు.
– ప్రతీ 25 పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలను కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌, ఒక్కో రౌండ్‌కు 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు.
– పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపు పూర్తవకుండా కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలు ప్రకటించరు.
– లెక్కింపు జరిగే ప్రతీ టేబుల్‌ వద్ద అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు ఉంటారు.

*మూడో దశ..
– ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఉంటాయి.
– ఆయా నియోజకవర్గాల్లోని కేంద్రాల సీరియల్‌ నెంబర్‌ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది.
(ఉదాహరణ: ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 14 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తే ఆ నియోజకవర్గంలో సీరియల్‌ నెం. 1-14 వరకూ పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలోని ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటి లెక్కింపు పూర్తయితే రౌండ్‌ ముగిసినట్లు.)
– ఆ తర్వాత సీరియల్‌ నెం. 15 నుంచి 29 వరకూ పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. దీంతో రెండో రౌండ్‌ పూర్తయినట్లు. ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రం సీరియల్‌ సంఖ్య అనుబంధంగా ఏ, బీ, సీ వంటి బై నెంబర్లు ఉంటే.. వాటిని ఒక పోలింగ్‌ కేంద్రంగానే పరిగణించి.. కౌంటింగ్‌ టేబుల్‌ కేటాయిస్తారు.
– ఓట్ల లెక్కింపు సందర్భంలో ఈవీఎంలకు సంబందించి బ్యాటరీ పనిచేయకున్నా.. మొరాయించినా.. తెరిచేందుకు అవకాశం లేకున్నా.. వాటిని పక్కన పెట్టి ఆ తర్వాతి సీరియల్‌ నెంబర్ లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు.
– ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక.. మొరాయించిన ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు. వాటిలో నమోదైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

*నాలుగో దశ..
– ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు పూర్తయి, వాటిని సరిచూసుకొని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు మొదలవుతుంది.
నియోజకవర్గం పరిధిలో ఎన్ని కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి.. లాటరీ విధానంలో ఐదు కార్డులు తీస్తారు.
– మొరాయించిన ఈవీఎంల పోలింగ్‌ స్టేషన్లను, మాక్‌ పోల్‌ వీవీ ప్యాట్‌ చీటీలను తొలగించని పోలింగ్‌ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు.
– లాటరీ విధానంలో ఎంపిక చేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్లను బయటకు తీస్తారు.
– ఈ చీటీల లెక్కింపునకు ప్రత్యేకంగా మెష్‌తో ఒక బూత్‌ ఏర్పాటు చేస్తారు.
– ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్‌ చీటీలలకు మధ్య వ్యత్యాసం వస్తే రెండోసారి మళ్లీ అలాగే వస్తే మూడోసారి లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీల ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తారు.
– వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు రిటర్నింగ్‌ అధికారి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నిర్వహిస్తారు. పరిశీలకుడు ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
– ఈ వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే ఫలితాలు వెల్లడిస్తారు.

* ఒక్కో రౌండ్‌ లెక్కింపునకు 30 నిమిషాలు..
– ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కౌంటింగ్‌ టేబుళ్లు: 14
– ఒక రౌండ్‌ లెక్కింపునకు పట్టే గరిష్ఠ సమయం: 30 నిమిషాలు (అరగంట)
– ఆయా నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఎన్ని రౌండ్లు, ఎంత సేపట్లో పూర్తవుతుందనేది ఆధారపడి ఉంటుంది.
– ఉదయం 11 గంటలకు దాదాపు 5 రౌండ్ల ఫలితాలు వచ్చేస్తాయి.

– కౌంటింగ్‌ ఏజెంట్లు? ..
– ప్రతీ అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున కౌంటింగ్‌ ఏజెంట్లను పెట్టుకోవచ్చు.
– వీరికి అదనంగా రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద ఒక ఏజెంటును ఏర్పాటు చేసుకోవాలి.
– పోస్టల్‌ బ్యాలట్ల పరిశీలనకు అభ్యర్థులు వారి తరఫు కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలి.
– కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదు.

TAGS