AP Assembly : ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly

AP Assembly

AP Assembly : ఆంధ్రప్రదేశ్‌ శాసన సభా సమావేశాలు ఈనెల 21వ తేదీ ఉదయం 9.46గంటలకు వెలగపూడిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు  గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. రెండు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రకటించినప్పటికీ సమావేశాల తేదీని ముందుకు జరిపారు. సమావేశాల మొదటి రోజు కొత్తగా ఎన్నికైన 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం , మరుసటి రోజు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. తొలిరోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ సభ్యుడైన రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్‌ నియమించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గురువారం ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో గవర్నర్‌ ప్రమాణం చేయిస్తారు.

రాష్ట్రంలో  టీడీపీ రెండోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసి మొదటి సారి అధికారంలో రాగా 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలైంది. వైఎస్‌ జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం 175కు 151 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టింది. టీడీపీ 23 స్థానాలతో, జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి రెండో సారి పోటీ చేసి ఘనవిజయం సాధించింది. 164 స్థానాల్లో కూటమి గెలుపొందగా వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.

24న మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్ లో ఈ నెల 24న ఉదయం 10గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై 21 సాయంత్రంలోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఏపీ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.

TAGS