Anganwandi Strike:అంగన్‌వాడీలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం..సమస్యలు తీరేనా?
Anganwandi Strike:ఏపీలో అంగన్ వాడీల సమ్మె రోజుకు ఉధృతం అవుతోంది. నేనున్నాను..నేను విన్నాను అన్న జగనన్నా మా గోడు వినపడటం లేదా?..మేము కనపడటం లేదా? అంటూ అంగన్ వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం అంగన్ వాడీ సంఘాలను చర్చలకు పిలిపించింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది.
వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుబడుతుంటే ..వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది. ఏఐటీయూసీతో పాటు మరో రెండు సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలసిందిగా ఆహ్వానం పంపింది. దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు..తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణలో కంటే రూ.వెయ్యి ఎక్కువ ఎంచుతామనిహామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. మిగతా అన్ని డిమాండ్‌లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి..పరిశీలిస్తామని చెప్పినప్పటికీ గతంలో రెండు పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు. మరి అంగన్‌వాడీలు కోరుకున్నట్టే వారికి పరిష్కారం లభిస్తుందా? అన్నది తెలియాలంటే ఈ రోజు సాయంత్రం జరిగే మీటింగ్ వరకు వేచి చూడాల్సిందే.