Balineni Srinivas : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్ తో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి రేపు (గురువారం) సమావేశమవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వైసీపీతో అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. దివంగత వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డి బాలినేని బంధువు కూడా అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో నాలుగు సార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్ధన రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీ అభ్యర్థి జనార్ధనరావును ఓడించారు.