JAISW News Telugu

Malla Reddy : మలన్నకు మళ్లీ షాక్..కాలేజీల్లో ఐటీ సోదాలు..

Malla Reddy

Malla Reddy

Malla Reddy : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే చెరువు భూములను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డికి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. మైసమ్మగూడలోని ఆయన కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం పది మంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంటున్నారని సమాచారం. మేనేజ్ మెంట్ కోటా సీట్లను బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు, బంధువుల పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆదాయపు పన్ను ఎగ్గొట్టారని మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

దుండిగల్ పరిధిలోని చెరువు శిఖం భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఇటీవల అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. సోమవారం మల్లారెడ్డి అగ్రికల్చర్ ప్రైవేట్ వర్సిటీలో విద్యార్థులను డిటైన్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన జరిగింది. మల్లారెడ్డి దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు. ఈ ఘటనల నుంచి తేరకోకముందే ఐటీ అధికారుల దాడులు మల్లారెడ్డికి పెద్ద షాకే. మొత్తానికి మల్లారెడ్డిని బీఆర్ఎస్ నుంచి బయటకు రప్పించేందుకే వరుస దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ ఒత్తిడి తట్టుకోలేక లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి జంప్ అవుతారో? బీఆర్ఎస్ లోనే ఉంటారో చూడాలి మరి.

Exit mobile version