Nama Nageswara rao : కేసీఆర్ కు మరో షాక్.. బీజేపీలోకి ‘నామా’ చేరిక ఖాయం..?

Nama Nageswara rao
Nama Nageswara rao : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు మరో షాక్ తగిలే పరిస్థితి కనపడుతోంది. బీఆర్ఎస్ కు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించింది. అయితే ఖమ్మం బరిలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని మొదటగా జలగం వెంకట్రావు భావించారు. ఆయనకే సీటు కన్ఫర్మ్ అవుతుందని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ బీజేపీ హైకమాండ్ నామాపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
అయితే పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయిస్తారని కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ టీడీపీ పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం లేదని, పూర్తిగా తెలంగాణలో తామే పోటీ చేస్తామని అంటున్నట్లు సమాచారం. అయితే నామా బీజేపీలో చేరిక అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో వచ్చే అవకాశమైతే కనపడుతోంది.