MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె మే 7 వరకు కస్టడీలోనే ఉండనుంది. కస్టడీ పొడిగింపునకు సీబీఐ, ఈడీలు అప్లికేషన్లు దాఖలు చేశాయి. 14 రోజుల కస్టడీ పొడిగించాలని కోరాయి.
ఈడీ చెప్పిందే చెబుతోందని కొత్తగా ఏదీ చెప్పడం లేదని కవిత తరఫు న్యాయవాది చెప్పారు. కవిత బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. కవితను అరెస్ట్ చేసి 60 రోజులు అయిందన్నారు. ఈ సమయంలో ఆమెపై చార్జీషీట్ సమర్పిస్తామని కోర్టుకు విన్నవించారు.
మద్యం కేసులో కొంతమంది నిందితుల నుంచి వాంగ్మూలం సేకరించారు. వాటి ఆధారంగా ఆమెపై కేసులు నమోదు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సూత్రధారిగా వ్యవహరించారని ఈడీ ఆరోపణ. దీనికి అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని వాడుకున్నట్లు తెలుస్తోంది.
శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు రాఘవ ద్వారా నగదు సేకరించారు. ఇలా కవితపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయడంతో ఆమె కస్టడీకే పరిమితమవుతున్నారు. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమే అంటున్నారు.
ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా భాగం చేశారు. ఆయనను కూడా అరెస్టు చేసి జైలులోనే ఉంచారు. ఆయనకు మధుమేహం సమస్య ఉన్నా విడిచిపెట్టడం లేదు. బెయిల్ ఇవ్వడం లేదు. దీంతో జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు.