India : మరో సంచలనం : పాకిస్తాన్‌తో కాల్పుల విరమణను రద్దు చేసుకున్న ఇండియా
India cancels ceasefire : ఇటీవల పహల్ గామ్ వద్ద జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ రాజుకున్నాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న తీవ్రవాదులే కారణమని భారత్ గట్టిగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే తక్షణమే అమల్లోకి వచ్చేలా భారత్ పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలు.. సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ వైఫల్యం నేపథ్యంలో కాల్పుల విరమణను నిలిపివేసే అంశాన్ని భారత్ తీవ్రంగా తీసుకుంది.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఇప్పటికే పలు కఠిన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం, పాకిస్థాన్ పౌరులకు వీసాలను రద్దు చేయడం, దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం వంటివి ఉన్నాయి. భారత్ తీసుకున్న ఈ చర్యలకు ప్రతిగా పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు, భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు, భారత్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.
సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, పాకిస్థాన్ వైపు నుంచి ఏ విధమైన దుస్సాహసానికైనా దీటుగా బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని భారత భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. కాల్పుల విరమణ రద్దు అనేది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నందున, భారత్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.