JAISW News Telugu

Package Surveys : మరో ‘ప్యాకేజీ సర్వే’.. ఊరందరిది ఓ దారైతే..

Package Surveys

Package Surveys

Package Surveys : ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్ కు మరో నెల రోజులు కూడా లేకపోవడంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్య కావడంతో నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4 ఫలితాలను విడుదల చేయనున్నారు. గడువు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సర్వేలకు అవకాశం లేదు. దీంతో సర్వేలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో ప్రమాణికత లేదు అనడంలో సందేహం లేదు. అన్ని ‘ప్యాకేజీ సర్వేలే’ అంటున్నారు. ఏవో కొన్ని సర్వే సంస్థలు తప్ప మిగతా వన్నీ పార్టీలు చేయించుకునేవే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక ఏపీలో ఏ పార్టీలు గెలుస్తుందనే దానిపై ఎన్నో సర్వేలు వచ్చాయి. అందులో కొన్ని ఎన్డీఏ కూటమి అని, మరికొన్ని వైసీపీ అని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పొలిటికల్ క్రిటిక్.. ఏపీ రాజకీయాలపై తన సర్వే ఫలితాలను ప్రకటించింది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాతనే ఈ సర్వే చేసినట్టు ఆ సంస్థ తెలిపింది.

ఈ సర్వే రిపోర్ట్ ఎలా ఉందంటే.. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 120-125 అసెంబ్లీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అంటోంది. లోక్ సభలోనూ ఇదే ప్రభంజనం ఉంటుందని.. 19-22 సీట్లను ఆ పార్టీ సాధిస్తుందని పేర్కొంది. ఇక టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి ఈసారి కూడా పరాభవం తప్పదు అని తెలిపింది. మూడు ప్రధాన పార్టీలు కలిసినా ఓటమి తప్పదు అని వెల్లడించింది. 50-55 అసెంబ్లీ సీట్లు మాత్రమే కూటమికి వస్తాయని, అలాగే లోక్ సభ సీట్లు 3-6 మాత్రమే వస్తాయని పేర్కొంది. వైసీపీకి పోల్ అయ్యే ఓట్ల శాతం పరంగా వైసీపీకి 50.80శాతం, టీడీపీ కూటమికి 47.50శాతం, ఇతరులకు 1.70 శాతం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

అయితే ఈ సర్వేపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ సర్వేలో ప్రామాణికత లేదని అంటున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని, జగన్ ఓడించేందుకు మూడు ప్రధాన పార్టీలు కూటమి కట్టినా కూడా 50 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం పక్షపాతమేనని చెబుతున్నారు. ‘‘ఊరందరిది ఓ దారైతే ఉలిపికట్టేది మరో దారి..’’ అన్నట్టుగా ఈ సర్వే తీరు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఓరకంగా ప్రజలను అయోమయంలోకి నెట్టివేయడమే అంటున్నారు. అయితే సర్వేల ఫలితాలను బట్టి ప్రజలు ఓటు వేయరని.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో ఇప్పటికే ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

Exit mobile version