Tamil Nadu Politics : తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ
Tamil Nadu Politics : తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సినిమా స్టార్లు కొత్త పార్టీలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విజయ్ కొత్త పార్టీ ప్రకటించగా మరో నటుడు విశాల్ కూడా మరో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హీరోలు పార్టీలు పెడుతుండటంతో రాజకీయాలు కొత్త మలుపులు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు.
గతంలో కూడా ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి వారు సీఎంలుగా చేశారు. తెలుగులో కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇలా సినిమాలకు రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ఈనేపథ్యంలో తమిళంలో కొత్త పార్టీలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయో తెలియడం లేదు. తమ అభిమాన తారలు రాజకీయాల్లోకి వస్తుండటంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఓ రాజకీయపార్టీని స్థాపించినా అది సరైన ఆదరణ పొందలేదు. దీంతో రద్దు చేసుకున్నారు. ఇప్పుడు విశాల్ పెట్టే పార్టీ 2026లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు సినిమా గ్లామర్ కు ఓట్లు పడేవి. కానీ ఇప్పుడు సినిమా గ్లామర్ అంతగా పనిచేయడం లేదు.
విశాల్ మక్కల్ నల ఇయక్కం పేరుతో పార్టీ నమోదు చేసుకున్నారు. విశాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని చెప్పారు. దీంతో తమిళనాట రాజకీయాలు మారుతాయో లేదో తెలియడం లేదు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని విశాల్ చూస్తున్నట్లు తెలుస్తోంది.