Rain in Delhi : ఢిల్లీలో మరోసారి భారీ వర్షం.. ట్రాఫిక్ కు అంతరాయం
Heavy Rain in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. దాదాపు 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
ఇదిలా ఉండగా, ఈరోజు (శనివారం) మధ్యాహ్నం నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మాన్ సింగ్ రోడ్, శాస్త్రి భవన్, ఫిరోజ్ షా రోడ్డులో భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.