Visakha railway zone : ఏపీలో కూటమి విజయం తర్వాత అన్నీ కలిసి వస్తున్నాయి. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ మరోసారి దేశంలోనే కీలకంగా మారబోతున్నది. తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీ అవకాశం కల్పించారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని, ఏపీ ప్రజల ఎన్నో ఏండ్ల డిమాండ్ నెరవేరుస్తున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ఏపీ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ రైల్వే లైన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు ప్రకటించారు.
ఇక రాష్ర్ట ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భూకేటాయింపు, ఇతర అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని తెలిపారు. అతి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనే కేంద్రం నిధులు కేటాయించినా, స్థలం కేటాయింపులో కొంత జాప్యం నెలకొంది. కేంద్రం అడిగిన 52 ఎకరాల స్థలం కేటాయించడంలో నెలకొన్న స్థంభన ఎట్టకేలకు పోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రైల్వేజోన్ త్వరలోనే నెరవేరుతుందని ప్రకటించారు.
ఇక తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమన్వయంతో ముందకెళ్తున్నాయి. రానున్న రోజుల్లో కొత్త ఏపీని చూడబోతున్నారు. విశాఖ రైల్వే జోన్ కల త్వరలోనే మీ కండ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. కాగా, ఈ ప్రకటనపై ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యాక కేంద్రం నుంచి విరివిగా ప్రాజెక్టులు, నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ఆయన ఢిల్లీ వెళ్లారు. తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చిన 24 గంటల్లోనే విశాఖ రైల్వేజోన్ పై సదరు మంత్రి ప్రకటన విడుదల చేశారు.