Gadwala MLA : బీఆర్ఎస్ కు మరో దెబ్బ.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?

Krishna Mohan Reddy

Gadwala MLA Krishna Mohan Reddy

Gadwala MLA : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్.. ఇలా రోజుకో ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నారు. తర్వాత ఎవరు పార్టీని వీడుతారో అని ఉన్న ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని వీడెందుకు రంగం సిద్దం చేసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ కోసం వేచి చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిశారు. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడంతోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదట టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణమోహన్ రెడ్డి 2009లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో 2014లో పార్టీలో చేరి మళ్లీ గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018, 2023 సార్వత్రిక ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత పదవీకాలం నేటితో పూర్తికానుంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపు ఖాయమని, వారం రోజుల్లోగా ఎప్పుడైనా బీఆర్ఎస్ వీడనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని సంప్రదించగా.. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే చేరికపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. పార్టీ మారాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. మండలాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు ఆలోచన అన్నారు. అందరి నిర్ణయం మేరకే తుది నిర్ణయం అన్నారు.

TAGS