Animal:రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ఈ సీజన్ లో భారీ బ్లాక్ బస్టర్‌గా రికార్డులకెక్కింది. ఈ సినిమా ఇప్పటికే 770కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించి 1000 కోట్ల క్లబ్ దిశగా సాగిపోతోంది. విడుదలై రెండు వారాలైనా చాలాచోట్ల మంచి వసూళ్లు చేస్తోందని పంపిణీవర్గాలు చెబుతున్నాయి. పెద్ద తెరపై పెద్ద విజయం సాధించిన యానిమల్ కి సంబంధించిన అన్ కట్ వెర్షన్ ని ఓటీటీలో విడుదల చేస్తారని అంతా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు ఊహించని షాకింగ్ పరిణామం.
యానిమల్ రా అండ్ రస్టిక్ కంటెంట్ కలుపుకుని సుమారు 4 గం.ల నిడివి ఉంటుందని, ఓటీటీలో ఈ మొత్తం సినిమాని రిలీజ్ చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఊహించని పిడుగులా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ పైనా కేంద్ర సెన్సార్ బోర్డ్ రివ్యూలు జరగనుండడంతో దాని ప్రభావం యానిమల్ పైనా పడుతుందని చెబుతున్నారు. యానిమల్ లో రా కంటెంట్ ని నేరుగా ఓటీటీలో ప్రదర్శించడం కుదరదు. నెట్ ఫ్లిక్స్ తొలిగా సీబీఎఫ్‌సి నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ పూర్తయాకే దీనిని ఓటీటీలో రిలీజ్ చేయాలి. లేదంటే చర్యలు సీరియస్ గా ఉంటాయి. అసభ్యకరమైన కంటెంట్ ని ఇక ఓటీటీలు ప్రసారం చేయడం కుదరని పరిస్థితి ఉంది.
అందుకే ఇప్పుడు యానిమల్ ఒరిజినల్ కంటెంట్ అంతా యథాతథంగా ఓటీటీ తెరపై చూడాలని ఎదురు చూసిన వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. యానిమల్ చిత్రంలో ఘాటైన ముద్దు సన్నివేశం, శృంగార సన్నివేశాలు యువతరంలో వాడి వేడిగా చర్చకు వచ్చాయి. రా వెర్షన్ తో నాలుగు గంటల సినిమా మరింత భీభత్సంగా ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు సెన్సార్ చేసిన వెర్షన్ ని మాత్రమే నెట్ ఫ్లిక్స్ విడుదల చేయగలదు. హింసాత్మక సన్నివేశాలపైనా కొన్ని కట్స్ విధించే అవకాశం ఉంది. అందువల్ల యానిమల్ ఓటీటీ వెర్షన్ నుంచి ఎలాంటి అదనపు గ్లింప్స్ ని ఊహించకూడదని క్లారిటీ వచ్చింది. ఏది ఏమైనా ఇది యానిమల్ అభిమానులను నిరాశపరిచే విషయం.
నిజానికి యానిమల్ కంటెంట్ పై బోలెడన్ని విమర్శలు చెలరేగాయి. ఇందులో హింసాత్మక కంటెంట్ రక్తపాతం అధికంగా ఉందని కూడా విమర్శలొచ్చాయి. కొన్ని అన్ రియలిస్టిక్ రా ఎప్రోచ్ గురించి తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ సినిమాలో ఎన్ని వివాదాంశాలు ఉన్నా ఎంపిక చేసుకున్న కథాంశం నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంది. అలాగే నిజజీవితంలో యానిమల్ లో ఉన్న పాత్రలు కూడా ఉన్నాయని బాబి లాంటి నటులు అన్నారు. నిజానికి నిజజీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇదని సందీప్ వంగా అన్నారు. యానిమల్ విజయానికి బహుశా ఇవే ప్రధాన కారణాలు. వాస్తవికత, సామీప్యత ప్రజలకు ఎప్పుడూ కనెక్టవుతాయనడంలో సందేహం లేదు. క్రియేటివ్ ఫ్రీడమ్ తో వాస్తవాలను ఘాడత లేదా డెప్త్‌ను పెంచి చూపించడం తప్పుకాదని యానిమల్ నిరూపించింది.