Animal Controversy:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అవినీతి భోగోతంపై తమిళ స్టార్ హీరో విశాల్ పోరాటం సంచలనంగా మారిన సంగి తెలిసిందే. తన సినిమా మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ సెన్సార్ క్లియరెన్స్ కోసం సీబీఎఫ్‌సికి రూ.6.5 లక్షలు లంచం చెల్లించినట్లు ఆరోపిస్తూ మీడియా హెడ్‌లైన్స్‌లోకొచ్చాడు. దీనిపై విచారణకు సమాచారం ప్రసారాల శాఖ ఆదేశించింది. రెండు నెలల తర్వాత CBFC సభ్యులపై చర్యలు మొదలయ్యాయి. CEO రవీందర్ భాకర్ పదవీవిరమణ చేయడంతో .. స్మితా వాట్స్ శర్మ అతని స్థానంలో అధికారిగా వచ్చారు.
అయితే సీబీఎఫ్‌సి అధికారులు ఈ అవినీతిలో నేరుగా పాల్గొనడం లేదు. వీళ్లకు మధ్యవర్తుల సహకారం అందుతోందని ఇంతకుముందు వెల్లడైంది. లంచాలు తీసుకోవడం సర్టిఫికేషన్ చేసేవాళ్లకు బదలాయించడం ఈ మధ్యవర్తుల పని. మార్క్ ఆంటోనీ వివాదంతో ఇదంతా బయటపడింది. సెన్సార్ షిప్ కోసం భారీగా డబ్బు చేతులు మారుతున్న విషయాన్ని ఇటీవల విచారణ అధికారులు కనుగొన్నారు. దీనిపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లోతైన విచారణను ప్రారంభించింది.
అయితే ఫైర్ యాడెడ్ టు ది పెట్రోల్ అన్న చందంగా యానిమల్ చిత్రంపై వివాదం సీబీఎఫ్‌సి సంస్కరణల ఒత్తిడిని పెంచింది. రణబీర్ కపూర్ యానిమల్ లో పెచ్చు మీరిన హింస – స్త్రీద్వేషం కారణంగా విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఈ చిత్రం కేవలం ఐదు మార్పులతో A సర్టిఫికేట్‌ను పొందింది. ఇది తప్పుడు విధానం అన్న సందేహాలు కలిగాయి. అయితే ఇప్పుడు కొనసాగుతున్న దర్యాప్తులో అసలు నిజాలు నిగ్గు తేల్తాయని భావిస్తున్నారు.
2021లో ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (FCAT) రద్దు అవ్వడం వల్ల ప్రస్తుతం శూన్యత కొనసాగుతోంది. CBFC విధించిన అభ్యంతరాలు కోతలను అప్పీల్ చేయడానికి అప్పిలేట్ కి వెళ్లలేని గందరగోళం నెలకొంది. చిత్రనిర్మాతలకు ఇప్పుడు క్రమబద్ధమైన ప్రక్రియ లేదు. ఎఫ్‌సిఏటి గతంలో తక్కువ ఖర్చుతో సకాలంలో తీర్మానాలు చేసేది. అది లేకపోవడం వల్ల చిత్రనిర్మాతలు చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల సినిమా విడుదలలు ఆలస్యం అవుతున్నాయి. యానిమల్ సీబీఎఫ్‌సి సర్టిఫికేషన్ విషయంలో అసలేం జరిగింది? అన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉంది. సీబీఎఫ్.సిలో పరిష్కారం కాని వాటి కోసం అప్పిలేట్ ట్రిబ్యునల్ కి వెళ్లి పరిష్కరించుకునే వెసులుబాటు అత్యావశ్యకం. కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.