AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి 26వ తేదీ దాకా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 19 నుంచే సమావేశాలు నిర్వహించాలని భావించినా, బక్రీద్ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవుల్లో ఉన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!
కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ విభజన కూడా పూర్తయ్యింది. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి కేబినేట్ స్థానం కేటాయించారు. కేబినెట్ లో సీనియర్లతో పాటు కొత్త వారికి సైతం అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు స్పీకర్ పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్లకు కేటాయిస్తారని ప్రచారంలో సాగుతున్నది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ప్రధానంగా వినిపిస్తున్నది.
అయ్యన్నకు స్పీకర్ గా అవకాశం ఇస్తారని సమాచారం. అయ్యన్న పాత్రుడి పేరు దాదాపు ఖరారు నిర్ణయమైందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన కూడా ఆసక్తిగా చూపుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ నుంచి గెలిచిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్ విప్‌గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
జగన్ శాసనసభకు వస్తారా?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానుండగా, తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు .టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైఎస్సార్ సీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత సభలో 151 సభ్యులతో ఉన్న వైసీపీ ఈసారి కేలం 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జగన్ శాసనసభకు వస్తారా? అనే చర్చగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తోటి ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా స్పీకర్ ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.