Chandrababu-Jagan : ఈనెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడం, మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు జరుగబోతుండడంతో పార్టీల అధినేతలకు కంటినిండా కునుకు కరువైంది. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ కూటమిలోకి బీజేపీని కలుపుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు అమిత్ షాతో, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. చంద్రబాబు వెళ్లారని సీఎం జగన్ సైతం ఢిల్లీ యాత్ర చేపట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో జగన్ ఇవాళ సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లగానే జగన్ కూడా ఢిల్లీయాత్ర పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరానికి నిధులతో పాటు జలశక్తి పరిశీలనలో ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు రాజకీయపరమైన చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అమిత్ షాతోనూ కీలక చర్చలు జరుపనున్నట్లు సమాచారం. షర్మిల చేపట్టిన ప్రత్యేక హోదా నిరసన స్వరంతో జగన్ పర్యటన రాష్ట్రానికి లాభం చేకూరుస్తుందా? లేదా అనే ఆసక్తి జనాల్లో నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం లేదని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత సుజనా చౌదరి టీడీపీ, బీజేపీ మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ నేతల హస్తిన పర్యటనలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.