Mee Seva : ఇక ప్రతీ ఊర్లో మీ సేవా కేంద్రం.. డ్వాక్రా మహిళలకు రేవంత్ గుడ్ న్యూస్  

Mee seva

Mee seva

Mee Seva Centers : ఆన్‌లైన్ సేవలతో పాటు పలు రకాల చెల్లింపులు, సర్టిఫికెట్లు, ఆధార్, అప్లికేషన్ సేవలను అందించే మీ సేవా కేంద్రాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున మీ సేవా కేంద్రాలను మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4500కు పైగా మీ సేవా కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 12,769 గ్రామ పంచాయతీల్లో ఈ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

మహిళా సంఘాలను బలోపేతం చేయడంతోపాటు మీ సేవా కేంద్రం సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మహిళ శక్తి పథకంలో భాగంగా గ్రామైక్య సంఘాల పేరుతో ఈ కేంద్రాలను మంజూరు చేయనుంది. దీంతో పాటు కేంద్రం ఏర్పాటుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, బయోమెట్రిక్ పరికరాలు, ఇంటర్నెట్ రూటర్లు తదితర పరికరాల కొనుగోలుకు రూ. 2.50 లక్షల రుణాన్ని కూడా ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా మంజూరు చేస్తుంది.

తర్వాత ఈ రుణాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే కమ్యూనిటీలో ఇంటర్ పూర్తి చేసిన మహిళలను ఆపరేటర్లుగా ఎంపిక చేసి నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో మహిళా సంఘాలకు కొత్త ఆర్థిక వనరులు, ఉపాధి లభించడంతో పాటు ప్రజలు కూడా గ్రామాల్లో మీసేవలు పొందవచ్చన్నారు.

TAGS