SP Lakshminarayana : అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు
SP Lakshminarayana : అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి అల్లర్ల సమయంలో అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్ బర్దర్ కోరగా.. తగిన బలగాలు లేవంటూ లక్ష్మీనారాయణ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అదనపు బలగాలు పంపకపోవడంతో అల్లర్లు పెరిగాయని అమిత్ బర్ధర్ నివేదించారు. ఆయనపై ఎన్నికల సంఘం వేటు తర్వాత ఎస్పీగా గౌతమి సాలి బాధ్యతలు చేపట్టారు.
తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి గౌతమి సాలి వివరణ కోరారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దీంతో లక్ష్మీనారాయణ రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీజీపీ కార్యాలయానికి ఆయనను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.