Anand Mahindra : ‘‘యే దిల్ మాంగే మోర్..’’ ‘ట్వెల్త్ ఫెయిల్’ మూవీపై ఆనంద్ మహీంద్రా షాకింగ్ కామెంట్స్
Anand Mahindra : ‘ట్వెల్త్ ఫెయిల్’ మూవీ దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సినిమా రిలైజ్ నెల రోజులు దాటిన తర్వాత కూడా చూసే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమాగా మౌత్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీని ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా సాధించాడనే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీ పడనుంది. జనరల్ కేటగిరిలో ఇండిపెండెంట్ గా చిత్ర బృందం నామినేట్ చేసింది. విధు వినోద్ చోప్రా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో విక్రాంత్ మస్సే హీరోగా నటించారు.
తాజాగా.. ఈ మూవీపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది మీరే కేవలం ఒకే ఒక్క సినిమా చూడాలనుకుంటే.. కచ్చితంగా ఈ మూవీ చూడాలని నెటిజన్లకు సలహా ఇచ్చారు. అలాగే ఈ సినిమా రివ్యూను తన స్టైల్లో ఇచ్చారు..అది ఇలా..
కథ:
రియల్ లైఫ్ హీరోల కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. కేవలం కథానాయకుడే కాదు.. ఈ దేశంలో విజయం కోసం ఆకలితో ఉన్న లక్షలాది మంది యువత అసాధారణ పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతోంది. జీవితంలో ఎదురవుతున్న కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు శ్రమిస్తోంది.
నటన:
ఈ సినిమాలో నటీనటులను ఎంచుకోవడంలో వినోధ్ చోప్రా అద్భుతంగా పనిచేశారు. ఇందులోని ప్రతి పాత్ర ఉద్వేగ పూరిత ప్రదర్శన చేసింది. కానీ విక్రాంత్ మస్సే అత్యద్భుత నటన.. నేషనల్ అవార్డ్ కు అర్హత సాధించింది. అతడు ఆ పాత్రలో జీవించాడు.
కథనం:
గొప్ప సినిమా అనేది మంచి కథ నుంచే వస్తుందనే విషయాన్ని దర్శకుడు చోప్రా స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో ఇంటర్వ్యూ సీన్ హైలెట్. అందులో కొంచెం కల్పితమే అయినప్పటికీ.. ఆ డైలాగులు మనసుల్ని హత్తుకుంటాయి. నవభారత్ నిర్మాణానికి మనం ఏం చేయాలో ఈ సినిమా చాటిచెపుతుంది. అని ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
‘యే దిల్ మాంగే మోర్..’ అంటూ ఇలాంటి మరిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షించారు. మహీంద్రా పోస్ట్ కు నటుడు విక్రాంత్ మస్సే ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీ లాంటి వ్యక్తి నుంచి ప్రశంసలు అందుకోవడంతో ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది’’ అన్నారు.