Parliament:లోక్‌సభ భద్రతా వైఫల్యం..ఢిల్లీ పోలీసుల కస్టడీలో మాజీ డీఎస్పీ తనయుడు
Security Breach:శీతాకాల పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ భద్రత మధ్య జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇలా జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసుని తీసుకుని విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ టెకీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అతడు కర్ణాటక పోలీసు శాఖలో పనిచేసిన మాజీ డీఎస్పీ కుమారుడు సాయికృష్ణ జగాలి అని పోలీసులు వివరించారు. రిటైర్డ్ డీఎస్పీ కుమారుడైన సాయికృష్ణ ..లోక్‌సభలో అలజడి సృష్టించిన మనోరంజన్‌కు స్నేహితుడు. వీరిద్దరూ బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బ్యాచ్‌మెట్స్.
విచారణలో భాగంగా మనోరంజన్ చెప్పిన వివరాల ఆధారంగా బుధవారం సాయంత్రం సాయికృష్ణను బగల్‌కోటెలోని అతడి ఇంటి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఢిల్లీకి తరలించి విచారిస్తున్నారు. తాజా పరిణామాలపై సాయి సోదరి మీడియాతో మాట్లాడుతూ `ఢిల్లీ పోలీసులు నా సోదరుడిని ప్రశ్నించారు. వారికి మేము పూర్తిగా సహకరించాం. నా సోదరుడు, మనోరంజన్ ఒకే ఇంట్లో ఉండేవారు. అయితే నా సోదరుడు ఇప్పుడు ఇంటి నుంచి పని చేస్తున్నాడు. అతడు ఎలాంటి తప్పు చేయలేదు` అని తెలిపారు.