Amit Shah – Tamilisai : తమిళిసైకి అమిత్ షా వార్నింగ్.. నెట్టింట వీడియో వైరల్

Amit Shah - Tamilisai

Amit Shah – Tamilisai

Amit Shah – Tamilisai : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి చేదు అనుభవం మిగిలింది. 25 నియోజకవర్గాల్లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలో రంగంలోకి దిగిన కాషాయ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన బీజేపీ ఆశలకు గండిపడింది.

 కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, దక్షిణ చెన్నై నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై,  నెల్లై నియోజకవర్గంలో నయనార్ నాగేంద్రన్, నీలగిరిలో ఎల్.మురుగన్, కన్యాకుమారిలో పొన్ రాధాకృష్ణన్‌లను పోటీకి దిగారు. కానీ బీజేపీ ఓట్ల వేటలో వెనుకబడిపోయింది.  

ఏఐఏడీఎంకేతో తెగిన పొత్తు  
అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తును వీడడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే కనీసం 10 నుంచి 20 నియోజకవర్గాల్లోనైనా తాము గెలిచే అవకాశం ఉండేదని బీజేపీనే స్వయంగా చెబుతున్నది. రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తమిళిసై తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య వాగ్వాదం పెరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అన్నామలై మద్దతుదారులు తమిళిసైపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.  

వేదికపైనే వార్నింగా?
ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన  కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేదికపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మాట్లాడుతున్నారు. అనంతరం  తమిళిసై సౌందరరాజన్ మర్యాదపూర్వకంగా అమిత్‌షా ముందుకు వెళ్లి అభివాదం చేశారు. అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా,  అమిత్ షా వెంటనే ఆమెను పిలిచి  హెచ్చరిస్తూ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నది.  తమిళిసై సమాధానం చెప్పబోగా అమిత్ షా అసహనంగా మొహం చిట్లిస్తుండడం గమనించవచ్చు.  అన్నామలైకు వ్యతిరేకంగా వ్యవహరించవ్దదని,  ధిక్కరిస్తే చర్యలు తప్పవని తమిళిసైని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అన్నామలై మద్దతుదారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.  బీజేపీ అగ్రనేతల్లో అన్నామలై పై సానుకూల దృక్పథం ఉన్నది. దీంతో అన్నామలైకు తిరుగులేదని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. 

TAGS