Amit Shah : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 2014 పొత్తులు రిపీట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమైన తర్వాత పొత్తు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో పొత్తులపైన అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే సీఏఏ చట్టం అమలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
ఎకనామిక్ టైమ్స్ సదస్సులో హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇవ్వాళ్టితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమయంలో సీఏఏ చట్టం అమలు కావాలంటే ఈ రోజునే బిల్లు ప్రతిపాదిస్తారా.. లేక మరో ప్రత్యేక సమావేశం ఏదైనా పెడుతారా అనే చర్చ నడుస్తోంది.
ఇక ఎన్డీఏ మిత్రపక్షాల గురించి మాట్లాడుతూ..తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండవచ్చన్నారు. పంజాబ్ లో అకాలీదళ్ తో చర్చలు నడుస్తున్నాయన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. కాగా, ఇప్పటికే శిరోమణి అకాలీదళ్, రాష్ట్రీయ లోక్ దళ్ వంటి పార్టీలు ఎన్డీఏలో చేరడం ఖాయమైంది. అయితే దీనిపై రెండు పార్టీల నుంచి అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.