Ambati Rambabu : సంబరాల రాంబాబు మళ్లీ వేసేశాడు..గతేడాది సంక్రాంతి సంబరాల్లో వేసిన స్టెప్పులను మరిచిపోకముందే మళ్లీ అద్దరగొట్టాడు.. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలోని పల్లె, పట్టణ ప్రాంతాల్లో వేసిన భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా అంబటి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. రాంబాబు దగ్గరుండి మరీ స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులతో స్టెప్పులు వేయించడం విశేషం. అనంతరం అంబటి ప్రత్యేక గీతానికి స్టెప్పులేశారు.
గత సంక్రాంతి వేడుకల్లో అంబటి వేసిన స్టెప్పులను ఇంకా ఎవరూ మరిచిపోలేదు. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇవాళ కూడా అంబటి ప్రత్యేక గీతానికి బంజారా మహిళలతో కలిసి జోరుషా హుషారుగా అంబటి స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది అపవిత్ర పొత్తు అని, వచ్చే ఎన్నికల్లో వారి పొత్తును ప్రజలు తగలేస్తారని చెప్పారు. భోగి సందర్భంగా నృత్యం చేయడం, పాటలు పాడడం సంతోషంగా ఉందన్నారు. మనిషి ఆనందాన్ని స్వాగతించాలని, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. తాను ఏదైనా ఓపెన్ గానే చెప్పే స్వభావం కలిగిన వ్యక్తినని, విమర్శలు చేయడంతో పాటు విమర్శలను స్వీకరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. గతంలో నన్ను సంబరాల రాంబాబు అని ట్రోల్ చేశారని, సంబరాలను తాను ఎంత హుషారుగా చేస్తానో, రాజకీయాలను అంతే సీరియస్ గా చేస్తానని అంబటి చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది డ్యాన్స్ కూడా ఇప్పటికే తెగ వైరల్ అవుతోంది. దీన్ని మరెంతగా ట్రోల్ చేస్తారో చూడాలి.