Ambati Vs CM Ramesh : లైవ్ లోనే రెచ్చిపోయిన అంబటి, సీఎం రమేష్.. వామ్మో బూతుల పురాణం
Ambati Rambabu Vs CM Ramesh : ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. అయినా ఇంకా అక్కడక్కడ ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఇంకా 20రోజుల సమయం ఉండగానే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. క్యాడర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణం అవుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల ఓ తెలుగు ఛానల్ డిబేట్ కు మంత్రి అంబటి రాంబాబు, బిజెపి మాజీ ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. డిబేట్ కొనసాగుతుండగా ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. వ్యక్తిగత దూషణలు, బెదిరింపుల వరకు వెళ్లింది. అసలు చెప్పరాని, వినకూడని భాషలో ఇద్దరు ఆడిపోసుకున్నారు. ఏకంగా లైవ్ లో తీట్టుకోవడంతో సదరు టీవీ ఛానల్ యాజమాన్యం లైవ్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
సన్నాసి యూజ్లెస్ ఫెలో, ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావ్, చీప్ ఫెలో లాంటి మాటలతో దారుణంగా తిట్టుకున్నారు. నేను తలచుకుంటే నువ్వు ఉన్న చోట నుంచి బయటకు పోలేవు అంటూ సీఎం రమేష్ అంబటి రాంబాబుని ఘాటుగా హెచ్చరించారు. దానికి నేనెం తక్కువ కాదన్నట్లు అంబటి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. నోరు జాగ్రత్త పెట్టుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. అందుకే ఇలాంటి వ్యక్తులకు ఉంటారనే నేను డిబేట్ కు రానన్నానని సీఎం రమేష్ అన్నారు. అంబటి సైతం అదే తీరుతో రెస్పాండ్ అయ్యారు. తాము లైవ్ డిబేట్లో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మరీ ఇద్దరు నేతలు తిట్టుకున్నారు.
తొలుత డిబేట్ సానుకూల వాతావరణం లోనే ప్రారంభం అయ్యింది. కానీ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని సీఎం రమేష్ అన్నారు. క్యూ లైన్లో బారులు తీరిన మహిళలు కూటమికి భారీగా మద్దతు పలికారని కామెంట్ చేశారు. దానికి రాంబాబు కౌంటర్ ఇస్తూ తమ పార్టీకే జనాలు జేజేలు పలికారన్నారు. మహిళల కోసం వైసీపీ ఏం చేసిందని సీఎం రమేష్ అంబటిని ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారా అంటూ నిలదీశారు. అయితే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఏం చేశారో తెలుసంటూ అంబటి ఎద్దేవా చేశారు. అక్కడ నుంచి డిబేట్ పక్కదారి పట్టింది. క్రమక్రమేణా వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ రోజున హింస చెలరేగింది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల వరకు అదే పరిస్థితి ఉంది. చివరకు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది.