Amazon : అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్ తో సమావేశమయ్యారు. ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని, సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాలని రేచల్ ను కోరారు. లాస్ వెగాస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు లోకేష్ హాజరయ్యారు. ఐటి సర్వ్ సినర్జీ సమ్మిటి ప్రాంగణంలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చలు జరిపారు. రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో టెక్ టాలెంట్ డెవలప్ మెంట్ సెంటర్ ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం కావాలని కోరారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సీఈవో..
ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలను వారికి వివరించారు. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఏపీటీడీ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ ఉపకరిస్తుందని లోకేష్ తెలిపారు. స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు రాష్ట్రంలో కీలకమన్నారు. ఏఐ, ఎంఎల్ లో ఏడబ్ల్యూఎస్ శ్రద్ధ, నిబద్ధత తమ ఆశయాలకు ఊతమిస్తాయని లోకేష్ చెప్పారు. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఏడబ్ల్యూఎస్ ఎండీ తెలిపారు.