U-19 World Cup Semis : అండర్ -19 వన్డే ప్రపంచకప్ లో భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ కు సౌతాఫ్రికా 245 లక్ష్యం పెట్టింది. అయితే మనవాళ్ల దూకుడుకు ఈ స్కోర్ పెద్దదేమి కాదు. కానీ 32 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరిపోయారు. ఇక అందరూ భారత్ పనైపోయినట్టే అనుకున్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సచిన్ దాస్, ఉదయ్ సహరన్ పట్టుదలతో ఆడి.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో భారత్ వరుసగా ఐదోసారి ఫైనల్ చేరింది.
అండర్ -19 ప్రపంచ కప్ ను చేజిక్కించుకునేందుకు మరో అడుగు మాత్రమే ఉంది. ఉత్కంఠ భరితంగా సాగిన కీలక సెమీ ఫైనల్ లో భారత్ 2 వికెట్ల తేడాతో అతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట 244/7 స్కోర్ చేసింది. లువాన్ ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్ వాన్ (64) రాణించారు. రాజ్ లింబాని (3/60), ముషీర్ ఖాన్ (2/43) ప్రత్యర్థిని కట్టడి చేశారు. సచిన్ దాస్ (96) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఉదయ్ సహరన్ (81) రాణించాడు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఛేదనలో భారత్ అనూహ్యంగా తడబడింది. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి 32కే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఈ టోర్నీలో నిలకడగా రాణించిన ముషీర్ ఖాన్(4), అర్షిన్ కులకర్ణి(12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. స్వింగ్, పేస్ తో విజృంభించిన దక్షిణాఫ్రికా పేసర్లు మఫాకా, ట్రిస్టాన్ భారత బ్యాటర్లను కుదురుకునే చాన్సే ఇవ్వలేదు. భారత్ కు ఇక ఓటమి తప్పదనుకున్న వేళ సచిన్ దాస్, ఉదయ సహరన్ నిలబడ్డారు. పేసర్లను జాగ్రత్తగా ఎదుర్కొని.. స్పిన్నర్లు వచ్చాక జోరు పెంచారు. చెత్త షాట్లకు వెళ్లకుండా బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఐదో వికెట్ కు 171 పరుగులు జత చేసి భారత్ గెలిచేందుకు దారులు పరిచారు.
ఓ దశలో గెలుపు సునాయాసమే అనుకుంటుండగా.. భారీ షాట్ కు పోయిన సచిన్.. వరుసగా రెండో సారి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దీనికి తోడు అవనీశ్ (10), అభిషేక్ (0) స్వల్ప తేడాతో ఔట్ కావడంతో భారత్ 227/7తో మళ్లీ ఇబ్బందుల్లో పడింది. కానీ ఉదయ్.. రాజ్ లింబాని(13) గెలిపించే బాధ్యతను సజావుగా నిర్వర్తించారు.