Ayodhya : అయోధ్య అతిథులకు అపురూప కానుకలు.. అందులో ఏమేం ఉన్నాయంటే..
Ayodhya : అయోధ్యలో 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. అయోధ్య పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లది హిందువులు ఈ వేడుకల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని 11 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలను జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పంపింది. అలాగే రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీల కుటుంబ సభ్యులకు సైతం ఆహ్వానాలు పంపడం విశేషం.
అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు కానుకలు ఇవ్వాలని తీర్థ క్షేత్ర ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. అయోధ్యకు వచ్చే అతిథుల కోం ఇప్పటికే వసతులు, సౌకర్యాలు అన్నింటినీ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల పాటు అయోధ్య నగరమంతా కోలహలంగా మారనుంది. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పీఎం నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఆయనకు ప్రత్యేక బహుమతులు కూడా ట్రస్ట్ అందించనుంది. 15 మీటర్ల పొడవైన అద్భుత రాముడి చిత్రాన్ని ఇవ్వనుంది.
అయోధ్యకు వచ్చే అతిథులకు కూడా రెండు రకాల బహుమతులు ఇవ్వనున్నారు. ఒక బాక్సులో లడ్డూ ప్రసాదం ఉండగా, మరొక బాక్సులో దేశీ నెయ్యితో తయారుచేసిన మోతిచూర్ లడ్డూను అతిథులకు అందించనున్నారు. ఇక రెండో బాక్స్ లో అయోధ్య నేలమట్టి, సరయూ నదీ జలాలతో పాటు ఓ మెమొంటోను కూడా ప్రదానం చేయనున్నారు. అయోధ్య పునాదుల నుంచి తీసిన మట్టిని అతిథులకు పంపిణీ చేస్తారు. వీటితో పాటు ఇత్తడి పల్లెం, వెండి నాణేలు కూడా బహుమతుల్లో ఉన్నాయి. వీటిపై రామమందిర చిత్రాన్ని ముద్రించారని సమాచారం.
ఈ కానుకలను ప్రత్యేకంగా ఓ బ్యాగ్ లో ఉంచి వీటిని అందించనున్నారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. అతిథులు ఎవరైనా 22న కార్యక్రమానికి హాజరు కాలేకపోతే.. వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు చెబుతున్నారు.