JAISW News Telugu

Amaravati Movement : అమరావతి ఉద్యమం @ 1500 రోజులు..


Amaravati Movement : అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు అన్నదాతల చేస్తున్న సుధీర్ఘ ఉద్యమం త్వరలో 1500 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నెల 25 వ తేదీకి అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై 1500 రోజులు పూర్తి చేసుకోంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని వెలగపూడిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. నాడు 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తదనంతర పరిస్థితుల్లో రాజధానిని మూడుముక్కలాటగా మార్చేందుకు ప్రయత్నిస్తోన్న క్రమంలో 2019 డిసెంబర్ 18 న అమరావతి రైతులు, ప్రభుత్వ నిరంకుశ – పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం బాట పట్టారు.

నాటి నుంచి ఎన్నో ఆటుపోటులు, వ్యయప్రయాసలు ఎదురొడ్డి ఉద్యమానికి ఊపిరి పోసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఈ మొత్తం ప్రయాణంలో అధికార వైసీపీ ప్రభుత్వం అనేక కుట్రలు, ప్రలోభాలతో అమరావతి రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తున్న మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. గడిచిన ఏడాది డిసెంబర్ 18 నాటికి ఉద్యమం ప్రారంభం అయి 4 ఏళ్లు పూర్తయిన పరిస్థితి.. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత నుంచి అమరావతి ఉద్యమానికి వస్తున్న స్పందన కారణంగానే ఇంత సుధీర్ఘకాలం పాటు ఈ ఉద్యమ స్పూర్తిని కొనసాగించగలుగుతున్నారు.

వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో 1500 రోజుల ఉద్యమాన్ని పురస్కరించుకుని తలపెట్టనున్న భారీ బహిరంగ సభ అమరావతి జేఏసీతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారనుంది.. ఈ సభ ద్వారా మూడు ముక్కలాటతో అమరావతి భవితను సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధానికి అమరావతి జేఏసీ సిద్ధమవుతోంది. ఎందుకంటే చావో రేవో తేల్చుకోవాల్సిన సంధికాలంలో నేడు అమరావతి జేఏసీ ఉంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీని అడ్డుకోవడం ద్వారా కొన ఊపిరితో ఉన్న అమరావతికి ప్రాణం పోసేందుకు అమరావతి జేఏసీ పోరాటం చేస్తోంది. ఇప్పుడు కూడా విఫలమై, మరొకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లైతే అమరావతి రాజధాని కలను శాశ్వతంగా మర్చిపోవడమే అన్నది వారికి తెలియని విషయం కాదు.

ఈ నేపథ్యలో రేపు 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు ముందు తమ రాజధాని ఏదో చెప్పిన తర్వాతే, ఎన్నికలకు వెళ్లలానే అల్టిమేటంతో అమరావతి జేఏసీ ముందుకు వెళ్లడం ద్వారా కొంతమేరకు అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం లేకపోలేదు. అమరావతి రాజధానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంఘాలు మద్దతు తెలుపుతున్న క్రమంలో రేపు 25 జరగబోయే సమావేశానికి అన్ని పక్షాల కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా తమకు అనుకూలంగా మార్చుకుంటాయనేదే ఇక్కడ ప్రశ్న.. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనను చేసినప్పటికీ ఆయా ప్రాంతాల ప్రజల నుంచి 3 రాజధానుల అంశానికి ఊహించిన స్థాయిలో స్పందన కరువైంది.. ఈ క్రమంలో అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షాలు ఎంతమేరకు తన భుజాలపై ఎత్తుకుంటాయనేది కూడా ప్రశ్నార్థకమే.

అమరావతి రాజధాని విషయానికి ఎక్కువగా ప్రచారం కల్పిస్తే, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మినహా మిగిలిన ప్రాంతాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు.. అమరావతి రాజధాని అజెండాను ప్రతిపక్షాలు మోయడం ద్వారా పరోక్షంగా వైసీపీకి మిగతా 11 జిల్లాల్లో ఈ నినాదం ప్రయోజనకరంగా మారే అవకాశం లేకపోలేదు… ఎన్నికల సమయంలో ప్రజల నాడి అంతుచిక్కని వ్యవహారం.. ఏ అంశం ఎన్నికల ప్రధాన అజెండాగా మారిందో, ఏ నినాదానికి పట్టం కట్టారో, ఏ భావోద్వేగానికి ఎంతమేరకు స్పందిచారనేది బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేస్తేగానీ తేలని అంశం.. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మంగా అడుగులు వేయాల్సిన అవసరం లేకపోలేదు.

– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.

Exit mobile version