Deputy CM Pawan Kalyan : 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన మంచి కార్యక్రమాల్లో పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించే అన్న క్యాంటీన్ల నిర్వహణ ఒకటి. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా నాటి ప్రభుత్వం కేవలం రూ.5కే నాణ్యమైన ఆహారాన్ని అందజేసి పేదల కడుపు నింపింది. తెలంగాణలో కూడా రూ.5కే భోజనం పెట్టే క్యాంటీన్లు ఉన్నా, ఏపీలో మెయింటెయిన్ చేస్తున్న క్వాలిటీ వేరని తిన్న తెలంగాణ వాళ్లు కూడా ఒప్పుకుంటారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కడుపు నింపే ఆ క్యాంటీన్లు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూతపడ్డాయి. కనీసం పేరు మార్చి వాటిని నిర్వహించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లే కాదు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పిఠాపురంలో జరిగిన జనసైనికుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
గతంలో డొక్కా సీతమ్మ చేసిన మంచి కార్యక్రమాలను ప్రస్తావించిన పవన్.. రాష్ట్రంలోని ఇతర క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పవన్ సదుద్దేశంతో ఇలా మాట్లాడాడు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. డొక్కా సీతమ్మ ఉభయ గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. తరచు వరదలు, అతివృష్టి, అనావృష్టితో అనేక సమస్యలతో సతమతమవుతున్న గోదావరి ప్రాంత గ్రామాల పేదలను ఆకలి బెడద నుంచి కాపాడారు. వచ్చిన వారికి నిత్యాన్నదానం చేస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. గతంలోనూ పవన్ ఆమె గురించి చాలాసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రావాలని కోరుతున్నందున అది జరగబోతోందని తెలుస్తోంది. గోదావరి ప్రాంతంలోని కొన్ని క్యాంటీన్లకు ఈ పేరు పెట్టే అవకాశం ఉంది.