Shilpa Reddy : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలికారు.. ఎన్నికల సమయంలో నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డి గెలుపు కోసం బన్నీ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ నంద్యాలకు వస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. ఇదే వ్యవహారం తర్వాత అల్లు, మెగా ఫ్యామిలీలో వివాదానికి కారణమైందని విశ్లేషకులు అంటుంటారు.
2019 ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డి తొలిసారిగా నంద్యాల నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో కూడా బన్నీ తన స్నేహితుడి విజయానికి తన మద్దతు తెలిపాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నంద్యాల నుంచి శిల్పా రవి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మరోసారి బన్నీ తన స్నేహితుడి కోసం ప్రచారానికి వెళ్లాడు. కానీ ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో పాటు వైసీపీ కూడా ఘోర పరాజయం పాలు కావడంతో ఆయన పార్టీ మారాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీడీపీ లేదా జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.